Amaravati, Sep 28: 2024లో 175/175 సీట్ల గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సీఎం నేతృత్వాన జరిగిన సమావేశం (CM Jagan Review Meeting) ముగిసింది.ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు.
గ్రామ/వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో గడప గపడకు.. పై గత సమీక్ష కన్నా ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు మాత్రం తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు ఇవాళ్టి సమావేశంలో దిశానిర్దేశం చేశారు.