Amaravati, Dec 16: గడపగడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaki Mana Prabhutvam) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం (CM Jagan Work Shop) సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు.
కాగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు.
దేశంలోనే నెంబర్ 1గా దూసుకుపోతున్న ఏపీ, రూ.40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి దేశంలోనే మొదటి స్థానం
కాగా, సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును అక్కాచెల్లెమ్మలకు వివరించడానికి ఇంటింటికి వెళుతున్న ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు గడపగడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతినెలా సీఎం వైఎస్ జగన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు సరిగా లేని వారికి జగన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. వీరిలో కొందరు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఈ 100 రోజులు పార్టీకి చాలా ముఖ్యమైనవని జగన్ చెప్పారు. పనితీరు మార్చుకోని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానని అన్నారు. ఎవరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదని... కానీ, ఆ పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారని చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజులు పాల్గొనాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు గత సమావేశంలోనే జగన్ చెప్పారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వివరించారు. ప్రతి రోజు ఒక సచివాలయం పరిధిలో ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు పర్యటించాలని జగన్ ఇంతకు ముందు ఆదేశించారు.
అయితే కొందరు గంట నుంచి రెండు గంటల సేపు మాత్రమే పర్యటిస్తూ 30 రోజులు పూర్తి చేశారు. ఇలాంటి వారి జాబితాను కూడా ఈ సమావేశంలో రిషి బయటపెట్టారు. ఇలాంటి వారు 20 మంది ఉన్నట్టుగా నివేదిక తేల్చింది. దీంతో, ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.