Amaravati, Feb 2: ఏపీ రాష్ట్రంలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని సీఎం జగన్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్ (Andhra Pradesh CM YS jagan) మాట్లాడారు. 91 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్, 15–18 ఏళ్ల మధ్యవారికి 100శాతం మొదటి డోస్ పూర్తి చేశారన్నారు. 60 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రికాషనరీ డోస్‌ను (COVID Vaccination) వేగవంతం చేయాలని అధికారులను CM ఆదేశించారు. 45 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు అందించే విషయంలో కాల పరిమితిని తగ్గించాల్సి ఉందన్నారు.
ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడా కూడా ఫిర్యాదులు ఉండకూడదన్నారు. కలెక్టర్లే కాదు, ఆరోగ్యశాఖ అధికారులను కూడా ఈ విషయంలో బాధ్యులను చేస్తానని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది హాజరు, వారు విధులు నిర్వర్తించడం, ఆస్పత్రులకు అందుబాటులో ఉండడం అన్నీకూడా జరగాలని ఆయన ఆదేశించారు. ప్రతి శాఖలోనూ ఇది అమలు కావాలన్నారు. దీనివల్ల 90శాతం సమస్యలు తీరిపోతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం కోవిడ్ థర్డ్ వేవ్‌లో ఉన్నామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. కరోనా నుంచి రికవరీ రేటు ప్రస్తుతం 94.72 శాతం ఉందని ఆయన తెలిపారు. కొద్ది రోజుల క్రితం గరిష్టంగా 36.02 శాతం ఉన్న పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.73 శాతం ఉందన్నారు.
కోవిడ్ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నామన్నారు. మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే వైద్యశాఖ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. నైట్ కర్ఫ్యూ, మాస్క్ ధరించకపోతే ఫైన్ విధించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్ నిబంధనలు, సోషల్ డిస్టేన్స్ పాటించేలా చూడాలన్నారు. కచ్చితంగా ఈ ఆంక్షలను అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఒమిక్రాన్ గరిష్ట తీవ్రతకు చేరి క్రమంగా తగ్గుముఖం పడుతుందన్నారు. ఈ 2 వారాలు కోవిడ్ నివారణా చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు పాటించడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. 1,05,930 మందికి పాజిటివ్ ఉంటే అందులో 2,286 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసుల్లో కేవలం 2.16 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్తున్నారన్నారు. ఇందులో కేవలం 1.29శాతం మంది మాత్రమే ఆక్సిజన్ స్థితికి వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.