Palanadu, Nov 11: ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన 'గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ " యూనిట్‌ను శుక్రవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వేలాదిమంది రైతులకు మేలు చేసే ఇంత మంచి పరిశ్రమను ఏర్పాటు చేసినందుకు ఐటీసీ బృందానికి అభినందనలు తెలిపారు.
‘‘ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ ఇవాళ ఇక్కడ ప్రారంభం అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడి, ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తుంది. ఐటీసీ స్పైస్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయ‘‘ని సీఎం జగన్ తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్
’’ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాలి. దీని నుంచి నేను మాట్లాడ్డం కన్నా... ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా మాట్లాడారు. ఆయన నుంచి ఈ మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్. గత మూడు సంవత్సరాల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలుస్తోంది.
పరిశ్రమలను పెట్టే వాళ్ల అభిప్రాయాలను కూడా అడిగి, పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నెంబర్ వన్ స్ధానం తీసుకోవడం గొప్ప మార్పునకు నిదర్శనమ’’ని సీఎం జగన్ అన్నారు.
రూ. 3450 కోట్లతో 26 జిల్లాల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు....
‘‘ఇటువంటి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరిన్ని రావాలని ఇప్పటికే కార్యాచరణ చేశాం. 26 జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో రైతులు స్ధానికంగా పండించే పంటలన్నింటికీ మెరుగైన ధర రావాలి, రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలి, వాల్యూ ఎడిషన్ ద్వారానే అది సాధ్యమవుతుందని 26 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ. 3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33 వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ. 1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేయనున్నాం. ఇవన్నీ పూర్తయితే, రాబోయే రెండు మూడేళ్లలో మొత్తం 26 అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలకు పెద్ద వరంగా మారుతుంద‘‘ని సీఎం జగన్ తెలిపారు.
దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1: ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి
’’ఈ ప్లాంట్ తొలిదశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే... దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంద‘‘ని ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సంజీవ్ పూరి ప్రశంసించారు. ఈ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు గొప్ప వరంగా మారుతుంది. నవంబరు 2020లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. ఇది నవంబరు- 2022 అంటే కేవలం 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందనేది అర్థమవుతుందని పేర్కొన్నారు.
దివంగత నేత ఆశయాలతో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆంధ్రా ముందడుగులు: మంత్రి విడదల రజిని
’’మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా అభివృద్దిలో, ఇతర రంగాలలో ముందుంది. నా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఐటీసీ సంస్ధ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభిచడం శుభ పరిణామం. ఇందులో స్ధానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, అందులో 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం మరో మంచి విషయం. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మనం గుర్తుచేసుకోవాలి. ఈ ప్రాంతానికి స్పైసెస్ పార్క్ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి సాధించిన ఘనత ఆయనది.
ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి కృషి చేస్తున్నారు. వైద్యారోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా ముందువరసలో ఉన్నాం, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదరిక నిర్మూలన, నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు, అంతేకాదు పారిశ్రామిక అభివృద్దికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కావాల్సింది నలభై ఏళ్ళ అనుభవం కాదు, మంచి మనసు...పట్టుదల, ఇవి మా ముఖ్యమంత్రికి ఉన్నాయి అని మంత్రి రజిని వ్యాఖ్యానించారు.