Andhra Pradesh: సీఎం జగన్ రుణం తీర్చుకోలేమంటున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు, 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, june 21: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపిన సంగతి విదితమే. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సీఎం (CM YS Jagan Mohan Reddy) సంతకం చేశారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి వివ‌రించారు. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 1998, 2008 డీఎస్సీ అర్హుల‌కు న్యాయం చేయలేదని, 2008 వారికి కూడా సీఎం జ‌గ‌నే న్యాయం చేశారని ఆమె అన్నారు. 4,565 మందికి ఇప్పుడు ల‌బ్ధిచేకూర‌నుంద‌ని, త్వరలోనే మార్గ‌ద‌ర్శ‌కాలు వస్తాయని, విధివిధానాలు రూపొందిస్తున్నారని అన్నారు.

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను.1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్‌) చదవడం ప్రారంభించాను.

రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి, అధికారులకు సూచించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడినని తెలిపారు.

ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు (Beggar qualifies for DSC 1998) సైకిల్‌పై బట్టలు అమ్ముతూ జీవనోపాధి సాగిస్తుండగా తాజా డీఎస్సీతో ఆయన జీవితమే మారిపోయింది. ఎట్టకేలకు ఉద్యోగస్తుడు అయిన ఆయన్ను స్థానిక యువకులు సెలూన్‌ షాప్‌కు తీసుకెళ్లి నీట్‌గా క్రాప్‌ చేయించారు. కొత్తబట్టలు కట్టించి.. కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేశారు. అల్లాక కేదారేశ్వరరావును ఇప్పుడు మాస్టర్‌ కేదారేశ్వరరావు అని పిలుస్తున్నారు.

డీఎస్సీ– 1998 అర్హుల జాబితాకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సత్తెనపల్లిలోని లక్కరాజు గార్లపాడు సెంటర్‌కు చెందిన 54 ఏళ్ల గుంటూరు మల్లేశ్వరరావు సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. ఇన్నాళ్లు ఉద్యోగంలేక, వివాహం కూడా అవ్వక తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఇంటిలోనే ఉన్న ఆయన వద్దకు వెళ్లి.. నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది అని సహచరులు చెప్పగానే ఆయన కంటివెంట నీటి ధార వర్షించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఇకపై తాను ప్రభుత్వ ఉద్యోగినని ఆనందంతో మురిసిపోయాడు.