Amaravati, May 9: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష (CM YS Jagan Mohan Reddy Review Meeting) చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ (Department Of Urban Development) పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని, లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని జగన్ అన్నారు. న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలని సీఎం సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు.
తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని, మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామని అధికారులు వివరించారు.2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు సీఎంకు తెలిపారు. 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని వివరించారు. గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో పాటుగా ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు, టిడ్కో ఇళ్లపై సమీక్ష, రోడ్లపై దృష్టి, అమరావతి ప్రాంతంలో పనులపై, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై, జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష జరిపారు.