Amaravati,Mar 30: జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కొత్త జిల్లా (creation of new districts) కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలని పాలనా సౌలభ్యానికి తగ్గట్టుగా ఉగాది నాటికి అంటే కొత్త తెలుగు సంవత్సరాదికి సిద్ధం చేయాలని గతంలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా (Form New Districts) చేసింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా విభజించారు. అరకు నియోజకవర్గాన్ని మాత్రం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండుగా విభజించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్ వెలువడి నూతన జిల్లా కేంద్రాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ విలువలు మారేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సాధారణంగా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో సవరణను వాయిదా వేశారు. 2022 ఏప్రిల్ వరకు సవరణ ఉండదని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో సవరణ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి రెండు విడతలుగా మార్కెట్ విలువల సవరణపై కసరత్తు మొదలు పెట్టారు.
మొదట కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువల సవరణపైనా కసరత్తు పూర్తి చేశారు. ప్రస్తుతం ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణ అమలవుతుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు ప్రకటించాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, స్థిరాస్తి లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.