YSR Kadapa, Sep 11: కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన చెందుతూ ఆత్మహత్య చేసుకుంటామనే సెల్ఫీ వీడియో (Kadapa Selfie Video Case) వైరల్‌గా మారిన సంగతలి విదితమే. ఈ సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ (Andhra Pradesh cm YS jagan)స్పందించారు.
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అంతకు ముందు సెల్ఫీ వీడియో (Kadapa Selfie Video Dispute) చూసి అక్బర్ బాషా కుటుంబాన్ని ఎస్పీ తన వద్దకు పిలిపించుకున్నారు. బాధిత కుటుంబం, కడప వైకాపా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించామన్నారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు.
ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్ పిటిషన్ ఇచ్చారని తెలిపారు. ‘‘సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాం. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించాం. భూ సమస్య పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చింది’’ అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
వారం రోజుల్లో తమ సమస్య పరిష్కరిస్తామని ఎస్పీ అన్బురాజన్ హామీ ఇచ్చారని అక్బర్ బాషా తెలిపారు. కడపలో ఎస్పీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఐ కొండారెడ్డి తీరుతో తమకు తీవ్ర ఆవేదన మిగిలిందన్నారు. సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు ఎస్పీ తెలిపారని అక్బర్ చెప్పారు.
కాగా వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియోలో కడప జిల్లా దువ్వూరు మండలంలోని తమ 1.5 ఎకరాల భూమిని ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు తిరుపాల్‌రెడ్డి.. మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డితో కలిసి బెదిరిస్తున్నారని కుటుంబం విలపించింది. వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. తాను కూడా వైకాపా కార్యకర్తనే అన్న దువ్వూరు మండలం ఎర్రబల్లెకు చెందిన అక్బర్ బాషా.. న్యాయం చేయాల్సిన పోలీసులు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేస్తుంటే దిక్కు లేని వాడిగా మిగిలిపోయానని తీవ్ర ఆవేదన చెందారు.
జీవనాధారమైన పొలాన్ని తమ ఆక్రమించారని.. తనకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ను, డీజీపి గౌతమ్ సవాంగ్‌ను వేడుకున్నారు. లేని పక్షంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటూ సెల్ఫీ వీడియోలో అక్బర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.