Kuppam, Sep 23: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటన కోసం (CM Jagan Kuppam Tour) తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం (CM YS Jagan's first public meeting) ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి పొందారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు.