Amaravati, Oct 4: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 72,861కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 6,224 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా (AP Coronavirus Report) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,13,014కి (Coronavirus in AP) చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 60,21,395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా నుంచి ఇవాళ కొత్తగా 7,798 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,51,791గా ఉంది. కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 41 మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5941కి (AP Coronavirus Deaths) పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 55,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 11.84 శాతంగా ఉంది.
పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన తరువాత గత నెల 21 నుంచి అడపా దడపా వస్తున్న విద్యార్థుల్లో రెండు వేర్వేరు స్కూళ్లకు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో విజయనగరం జిల్లా గంట్యాడ పాఠశాలలో 20 మందికి, దత్తిరాజేరు మండలం దత్తి ఉన్నత పాఠశాలలో ఏడుగురికి కరోనా సోకింది. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. అవసరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీచేసింది.
గంట్యాడ జిల్లా పరిషత్ పాఠశాలలో 9, 10 తరగతుల పిల్లలకు గత నెల 30న ముందుజాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 73 మంది విద్యార్థులతో పాటు గ్రామానికి చెందిన మరికొందరు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 108 మందికి పరీక్షలు చేయగా 20 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది.ఈ ఘటనతో మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను ఫోన్‌లో కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.
అలాగే, దత్తి పాఠశాలలో గత నెల 27, 28 తేదీల్లో తొమ్మిది, పదో తరగతికి చెందిన వంద మంది విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు పీహెచ్‌సీ సీహెచ్‌ఓ సత్యనారాయణ తెలిపారు. ఇందులో ఇద్దరు హోం ఐసోలేషన్‌లో ఉండగా మిగిలిన ఐదుగురిని విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో వైద్యం అందిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని జిల్లా వైద్యాధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎవరికీ వైరస్ లక్షణాలు లేనందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరికోసం ముందస్తుగా జిల్లా ఆసుపత్రిలో 20 పడకలనూ సిద్ధం చేశామన్నారు.