Amaravati, June 28: ఏపీలో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనావైరస్ పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై (Curfew Relaxation in AP) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు (Curfew Relaxation) సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది.
రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కొవిడ్ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
సడలింపు జిల్లాలు: అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం.
ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోకున్నారు.