Amaravati, june 28: జూన్ 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొల్లపూడిలో (AP CM YS Jagan to visit Gollapudi) పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో ఈ కార్యక్రమం (Disha App Campaign in Gollapudi) జరగనుంది.
ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలోప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గొల్లపూడి వెళ్లనున్నారు.గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన డీఐజీ పాల్‌రాజ్ (టెక్నికల్ సర్వీస్), దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ–2 విక్రాంత్ పాటిల్, విజయవాడ వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె. హనుమంతరావులతో చర్చించారు.
మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలోనే ఆయన స్వయంగా యాప్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రఘురాం వివరించారు. ఎంపీడీఓ సునీత, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస నాయక్, భవానీపురం సీఐ జె. మురళీకృష్ణ, గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.