Andhra Pradesh Day 2021: అమరజీవి త్యాగం నుంచి నేటి వరకు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చరిత్ర ఏమిటీ, పెద్దమనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏమిటీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంపై ప్రత్యేక కథనం
Andhra Pradesh Day: History, Facts and Significance about Andhra Pradesh Formation Day

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్  అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా (Telangana) ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) విలీనం చేసారు. ఆ తరువాతి కాలంలో హైదరాబాద్ విలీనమైన తరువాత మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొత్తం 23 జిల్లాలయ్యాయి. 2014 జూన్ 2 న తెలంగాణ వేరుపడటంతో ఇప్పుడు 13 జిల్లాలతో ఏపీ కొనసాగుతోంది.

దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం (Andhra). జాతీయోద్యమ సమయంలోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. అవతరణకు ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో 40 శాతం జనసంఖ్య, 58 శాతం రాష్ట్ర విస్తీర్ణం తెలుగు వారిదే. రాష్ట్ర రాజకీయాలలో తమకు పలుకుబడి లేదని, తమిళులచేత అవహేళనకు గురౌతున్నామన్న భావన తెలుగువారిలో ఆనాడు మెదలైంది. ఉద్యోగాలలో మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో వివరించారు. తెలుగువారి వెనుకుబాటు తనాన్ని కూడా చర్చించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ నినదించిన తెలుగువారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ ప్రజలు గట్టి పట్టుదల కలిగినవారని, అందుకే అన్ని చోట్ల రాణిస్తున్నారంటూ ట్వీట్

1911 చివరినాటికి ప్రత్యేక రాష్ట్ర చర్చ ఊపందుకుంది. ఇక, తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే, ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. ఆనాటి పాపులర్ పత్రికలైన ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, ప్రత్యేక ఆంధ్ర స్టేట్ కోరికను బలపరిచాయి. తమిళులలో మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తమైయ్యింది. పట్టాభి సీతారామయ్య మాత్రం ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని సూచించారు.

తర్వాత 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ సభలోనూ ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంతగా ఆసక్తి చూపలేదు. తర్వాత పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి చర్చలు జరిగాయి. రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు.

మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలు

కాకినాడలో జరిగిన నాలుగో ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యతో కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేశారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు. స్వాతంత్రం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.

50రోజుల నిరహార దీక్ష తరువాత, మద్రాసును వదులుకొంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సాధ్యపడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. పొట్టీ శ్రీరాములు అందుకు అంగీకరించకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. ఆయన ఆత్మార్పణ తరువాత ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో పెద్దయెత్తున హింసా కాండ చెలరేగింది. మద్రాసు నగరాన్ని మినహాయించి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ఆర్థికపరమైన, పాలనా పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రియలో అవసరమైన సిఫారసులు చేయడానికి జస్టిస్ కైలాసనాథ్ వాంచూ ను ప్రత్యేకాధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాంచూ నివేదిక ప్రకారంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును 1953 మార్చి 25న నెహ్రూ ప్రకటించారు.

తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే అభిప్రాయాలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వినబడుతుండేది. 1938 లో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడే అవకాశాల గురించి మాట్లాడారు. 1940లో, 1942లో ఆంధ్ర నాయకులు సమైక్య తెలుగు రాష్ట్రం గురించి తమ ఆశాభావాలను వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్థానం విమోచన తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. 1949 లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. 1951 లో కూడా కాంగ్రెస్ అఖిల భారత సమావేశాలలో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు విశాలాంధ్ర విషయాన్ని ప్రస్తావించారు.

ఐదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు, మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక ను పాటించాలని కోరారు. ఆచార్య రంగా నాయకత్వంలోని కృషిక్ లోక్‌పార్టీ తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. కమ్యూనిష్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు. 1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులతో సహా అన్ని జాతీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. డిసెంబరు 1953లో ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ నివేదిక 1955 సెప్టెంబర్ 30 న సమర్పించింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే వారిని మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి, తెలుగు ప్రాంతాలను తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే, ఐదేళ్ల తర్వాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరిస్తే ఆంధ్రలో దీనిని విలీనం చెయ్యెచ్చని పేర్కొంది. ఈ సూచనలను సమర్ధించిన వారిలో తెలంగాణకు చెందిన కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు ఉన్నారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది ఆంధ్ర‌ప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరో 15 మంది తటస్థంగా ఉండిపోయారు. ఈ సమయంలో తెలంగాణా, విశాలాంధ్రవాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేశారు.

కమ్యూనిస్టులు మరో అడుగు ముందుకు వేసి తాము శాసనసభకు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆంధ్రప్రదేశ్‌నే సమర్ధించి, ఇరు ప్రాంతాల నేతలు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరఫున బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు.

అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జులై 19న పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో 1956 నవంబర్ 1న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.

పెద్దమనుషుల ఒప్పందంలోని చాలా ముఖ్యమైన అంశం:రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి ఉండాలి.కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

అయితే, పాలకుల నిర్లక్ష్యంతో మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది. ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతూ ఉద్యమాన్ని లేవదీశారు. ఇది క్రమంగా ఉద్ధృతమై 1969 నాటికి తీవ్రరూపం దాల్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా, 2000 తర్వాత రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి,కార్మిక, కర్షక సంఘాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడంతో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దాదాపు 60 ఏళ్లపాటు కలిసున్న తెలుగువారు మరోసారి విడిపోయారు.

2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికి, జూన్ 2న నవ నిర్మాణ దీక్షల పేరుతో కొట్ల రూపాయల ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేసింది. ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబర్ 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రస్తుత వై యస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తుంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.