Pawan Kalyan Serious On Kakinada City MLA Kondababu over Ration Rice Smuggling

Kakinada, Nov 29: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సయయంలోనే, జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాళ్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు. వేల టన్నుల బియ్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు. కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా తయారైందని, ఇక్కడ్నించి యధేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకుని కేసులు పెట్టినా సరే... పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరా శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్

కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని... అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని, తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని వివరించారు. అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా? దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలి" అని పవన్ పేర్కొన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన కాకినాడ పోర్టు పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు అధికారులపైనా ఆయన సీరియస్‌ అయ్యారు. రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. అందరికీ చురకలు అంటించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే.. ఏం చేస్తున్నారు?. ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా?. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్‌ బియ్యం ఎలా వస్తాయి? అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు.

ఆ టైంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. పవన్‌ పట్టించుకోలేదు. దీంతో ఆ ఎమ్మెల్యే నీళ్లు నములుతూ కనిపించారు. ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి కొండబాబును పవన్‌ టార్గెట్‌ చేశారు. ఈసారి టగ్గులో వెళ్తూ ఆయనపై మండిపడ్డారు. బిజినెస్ అంటే స్మగ్లర్ ను అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు కంగుతిన్నారు.

మనం ఏమీ చెయ్యకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్‌ అన్నారు. దానికి.. రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వెయిరీ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు. అయినా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా.. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హోం మంత్రికి, పీఎంవోలకు లేఖ రాస్తానని పవన్‌ అన్నారు.

రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లి మరీ పవన్ పరిశీలించడం గమనార్హం. తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరకున్నాక.. ‘‘ఎస్పీ ఎందుకు నిపించడం లేదు. నేను వచ్చే టైంకి ఎందుకు సెలవు తీసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది’’ అంటూ పవన్‌ వ్యాఖ్యానించారు.