Andhra Pradesh Election Results 2024 Live Updates: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలు మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత అయిదు గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యంగా రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగుతుంది. అందుకు 9-10 గంటలు పట్టనుంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల ఫలితాలు తొలుత రానున్నాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలో 5 గంటల వ్యవధిలో లెక్కింపు పూర్తికానుంది.
అమలాపురం లోక్‌సభ స్థానం ఫలితం అన్నింటి కంటే ఆలస్యం కానుంది. అత్యధికంగా 27 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తయ్యేందుకు 9-10 గంటల సమయం పట్టనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా దాదాపుగా ఫలితాలపై పూర్తి స్పష్టత రానుంది. వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు కూడా పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. 9 గంటల్లో అమలాపురం ఫలితాలు, 5 గంటల్లో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన సీఈవో ఎంకే మీనా
లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో జరుగుతాయి. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శాసనసభ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ఒకే కౌంటింగ్ హాలులో జరుగుతుంది. అందుకే తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. 30 నిమిషాల తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతుంది. పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల సమయం, ఈవీఎం ఓట్లకు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయం పడుతుంది.
ఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లు లెక్కిస్తారు.