ఏపీలో మునుపెన్నడూ చూడని రీతిలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దాంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో, కొన్ని పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరగడంతో పోలింగ్ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు ఇవాళ అందుతాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల ద్వారా 79.2 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.8 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.
ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని మీనా వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.4 శాతం పోలింగ్ నమోదైనట్టు స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని అన్నారు.