VJY, Jan 22: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈసీ అప్ లోడ్ చేసింది.
ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,00,09,275 మంది ఉండగా.. మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482.. సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు.
కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం.
ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో జనవరి 31లోగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా సీఎస్ చర్చించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు సమావేశానికి హాజరయ్యారు.