Vjy, Jan 22: వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు.
విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు, మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధం అవుతున్నారు. అంతేకాకుండా.. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించనున్నారు.
వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది.
అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు.
కాగా, సమ్మెలో పాల్గొంటూ విధులకు హాజరుకాని కార్యకర్తలు మొత్తం 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి ఎం.ఎన్.రాణి తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలో 4151 మంది అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొనగా.. సోమవారం వరకు 503 మంది తిరిగి విధుల్లో చేరారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఇప్పటికీ విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదన్నారు.
ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక తమ డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్‌వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్‌కు ఇచ్చేందుకు తరలిరావాలని ఇప్పటికే అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు సమాచారం.