Guntur West, Feb 14: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటిస్తూ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోంది.ఇప్పటికే దాదాపు సగం నియోజకవర్గాలకు జగన్ సర్కారు ఇంఛార్జులను ప్రకటించింది.
ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ సారి ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) గెలిచి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ-జనసేన పొత్తులు ఖరారు అయినట్లేనని ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. రెండు పార్టీల అధినేతలు ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. బీజేపీతో కూడా పొత్తు చర్చలు నడుస్తున్నాయి. ఇక గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న చంద్రబాబు ఈ సారి వైసీపీ అభ్యర్థులకు ధీటుగా తమ అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల రిపోర్ట్ ను తెచ్చుకుని అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో (Guntur West Constituency) అధికార వైసీపీ నుంచి ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బలమైన మహిళా నేతను రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ మహిళా పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం.
మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను (woman industrialist VR Sri Lakshmi-Syamala) మంత్రి విడదల రజినీకి పోటీగా దింపుతారని నియోజకర్గంలో టాక్ నడుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతుగా నిలవడంతో టీడీపీ గట్టి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బిజినెస్ ఉమెన్ వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక శ్యామల విషయానికి వస్తే కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన శ్యామల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పతనావస్థలో ఉన్న పలు ఆలయాలను పునరుద్ధరించారు.
గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ పెరంబదూర్ పర్యటనకు వెళ్లగా.. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. ఎంతో సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కీలక నేతలు చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఎవరో తెలియాలంటే టీడీపీ పార్టీ అభ్యర్థుల ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..