Andhra Pradesh Fire Accident (Photo-X)

తూర్పు గోదావరి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.రాయవరంలో ఉన్న గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాణసంచా పరిశ్రమ యజమాని సత్తిబాబు ఉన్నట్లు సమాచారం.ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.

తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం, మరో మూడు రోజుల పాటు ఎండలతో కూడిన వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో సుమారు 40 మంది కార్మికులు కేంద్రంలో పని చేస్తున్నారు. భారీ పేలుడు ధాటికి కేంద్రం షెడ్డు గోడ కూలి, శిథిలాల కింద మరికొందరు చిక్కి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో పరిశీలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందించారు. వారం క్రితం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ బాణసంచా కేంద్రాన్ని పరిశీలించి, అన్ని రక్షణ చర్యలు ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత దర్యాప్తులో యజమానులు అగ్నిప్రమాద నివారణ పరికరాలను సక్రమంగా ఉపయోగించారా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునే పనులు కొనసాగుతున్నాయి.

ఈ ఘోర ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనమని అధికారులకు ఆదేశించారు. మరోవైపు, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని మంత్రి పేర్కొన్నారు.

సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.