
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. పగలంతా ఎండ కాసి, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఈ తారుమారైన వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని సూచించింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మెరుపులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
రేపు ఇంకా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని, అలాగే రేపు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు ఎదురుకావచ్చని హెచ్చరిక జారీ చేసింది. ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం వాతావరణం కొంతవరకు పొడిగా ఉండే అవకాశం ఉంది. అయితే, రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్నందున ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉదయం, సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమూ ఉందని IMD పేర్కొంది.
వాతావరణశాఖ ప్రకారం అక్టోబర్ నెలలో మొత్తం మూడు దశల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. అలాగే అక్టోబర్ 10 నుంచి 20 వరకు మోస్తరు వర్షాలు తెలంగాణ, ఏపీ అంతటా కురుస్తాయని తెలిపింది. అక్టోబర్ 21 నుంచి 31 వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల మధ్య నుంచి మాన్సూన్ మళ్లీ చురుకుగా మారనుంది. దీంతో రైతులకు ఇది ఉపశమనం కానుంది కానీ పట్టణ ప్రాంతాల్లో వరదల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది.
IMD ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ లైన్లు, చెట్లు వంటి ప్రాంతాలకు దూరంగా ఉండమని సూచించారు.