Srikakulam, April 12: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వే గేటు సమీపంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం (Srikakulam Train Accident) జరిగింది. రైలు ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలవ్వగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు.. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బాతు వ రైల్వే గేటు సమీపానికి వచ్చేసరికి నిలిచిపోయింది. దీంతో బోగీల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు.
అయితే అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను ( Five Killed As Speeding Konark Express Train) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. జీఆర్పీ పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. మృతుల వద్ద దొరికిన ఆధార్ కార్డుల మేర కు అసోం, ఒడిశాగా గుర్తించినట్లు సమాచారం. రైలు బాతువ సమీపంలో ఆగిపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైను లాగడం వల్లే బండి ఆగిందని రైల్వే సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో చైను లాగారని.. బండి నుంచి దిగి పారిపోయే క్రమంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని ఐదుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన తాజా వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిని గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు.
ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్ స్వయంగా రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని వివరించారు.