Amaravati, July 4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా నల్ల బెలూన్ల కలకలం చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని (PM Narendra modi) హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్లబెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా గన్నవరం డీఎస్పీ విజయ్‌పాల్ (Gannavaram DSP) మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప‍్పటికే కాంగ్రెస్ నేత సుంకర పద‍్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశాము. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తాము’’ అని అన్నారు. అనంతరం, ఏపీలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కుట్ర పన్నిన దుష్టశక్తులను గుర్తించాలి. కాంగ్రెస్ నేతలపై చర‍్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ.. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు మూడు బెలూన్లను ఎగురవేశారన్నారు.
మూడు బెలూన్లు ఎగరవేస్తే భద్రతా లోపం అంటారా? అని ప్రశ్నించారు. ఎక్కడో విజయవాడలో బెలూన్లు ఎగురవేశారని అన్నారు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామని... కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ (Rajiv ratan) కోసం వెతుకుతున్నామని డీఎస్పీ విజయపాల్ అన్నారు. కాగా గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో కొందరు యువకులు ఈ నల్ల బెలూన్లు వదిలారు.
Here's Videos
Andhra Pradesh Police detained some people with Black Balloons who were protesting against PM Modi. pic.twitter.com/kWWx3wZN6O
— Nikhil Choudhary (@NikhilCh_) July 4, 2022
Black balloons were flown by congress workers who organized protest for coming to #AndhraPradesh, after PM Narendra Modi's chopper took off from #Vijayawada. Andhra Police are investigating into the matter and trying to identify who exactly did it. pic.twitter.com/pVxnVpQ7O5
— Nikhil Choudhary (@NikhilCh_) July 4, 2022
ఇక ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నల్ల బెలున్లతో కాంగ్రెస్(Congress) పార్టీ నిరసనకు దిగింది. ప్రధాని మోదీ (Modi) జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు (Jetti gurunathrao) నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది శూన్యమంటూ ఆరోపించారు. మోదీ పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథ్ రావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పర్యటనను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ (Congress) నిరసనకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ (Sailajanath) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా... జాంపేట గాంధీ బొమ్మసెంటర్ వద్ద కాంగ్రెస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాధ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపి విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని... ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
ఏపీలో ప్రధాని మోదీ (Modi) పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) వచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకలో పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులను మోహరించారు. దాదాపు 2500 మంది విధులు నిర్వహిస్తున్నారు. సభా వేదికను ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆదివారం నుంచేసభా ప్రాంగణానికి బయట వ్యక్తులు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వేదిక ఏర్పాటు సిబ్బంది, అధికారులకు మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు.