YS Jagan (X)

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రాబోతోన్న గూగుల్‌ డేటా సెంటర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రచారంలో వచ్చిన వివిధ రకాల వార్తలను ఆయన ఖండిస్తూ.. ఈ డాటా సెంటర్ నిర్మాణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేసిన బీజానికి కొనసాగింపు మాత్రమే అని చెప్పారు. ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అదానీ గ్రూప్, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల సమిష్టి కృషి ఫలితమేనని తెలిపారు.

2020లో కోవిడ్‌-19 మహమ్మారి సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేసినట్లు జగన్ చెప్పారు. ఆ తరువాత 2023 మే 3న డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశారు. సింగపూర్‌ నుంచి సబ్‌సీ కేబుల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గూగుల్‌ డేటా సెంటర్ వస్తుండటానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వాతావరణం, కృషి కీలకమని జగన్‌ చెప్పారు.

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ సెంటర్, ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ కీలక ప్రకటన, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం ఏపీలో..

ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కూడా వైఎస్సార్‌సీపీ అధినేత సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు. "క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్రం పరిస్థితి వీక్‌. వేరేవాళ్లకి దక్కాల్సిన ఘనతలను చోరీ చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ఆయన అన్నారు.అదానీ గూగుల్‌ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని, ప్రాజెక్టు విస్తరణ కారణంగా విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ రాబోతున్నదని చెప్పారు.

డేటా సెంటర్ నిర్మాణం ద్వారా పెద్దగా ఉద్యోగాలు రాకపోయినా, రాష్ట్రానికి కొత్త ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. భవిష్యత్‌ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, ఈ ప్రాజెక్ట్‌తో 25,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఐటీ పార్క్‌, స్కిల్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని, రిక్రియేషన్‌, సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసేలా ఒప్పందం అయ్యిందని వెల్లడించారు.

అదానీ ఇన్‌ఫ్రా సంస్థలు మాత్రమే గూగుల్‌ డేటా సెంటర్ నిర్మాణంలో నిమగ్నమని, చంద్రబాబు ప్రభుత్వం కనీసం కృతజ్ఞతలు చెప్పకపోవడం, వైఎస్సార్‌సీపీ ఘనతను దాచడం నిజంగా సిగ్గుచేటని జగన్‌ విమర్శించారు. డేటా సెంటర్ నిర్మాణం ద్వారా రాష్ట్రానికి భవిష్యత్తులో పెద్ద మార్పులు దక్కుతాయని, కానీ ఈ ఘనత వైఎస్సార్‌సీపీ ప్రయత్నాల కారణంగా సాధ్యమయిందని స్పష్టంగా తెలిపారు.