
Visakha, Oct 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడిగా ఖరారు చేసింది. ఈ భారీ పెట్టుబడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, IT రంగంలో కొత్త ఉపాధి అవకాశాలకు కీలకంగా మారనుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ఒప్పందాలు ఈరోజు పూర్తి అయ్యాయి. విశాఖపట్నం భారతదేశంలో AI రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. యూనియన్ మంత్రులు, రాష్ట్ర అధికారులు, గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రాజెక్ట్ ప్రాధాన్యతను హైలైట్ చేశారు.విశాఖపట్నం AI హబ్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 10 వేల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇది నేరుగా టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్రంలో AI పరిశోధన, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి మద్దతుగా ఉంటుందని తెలిపారు.
స్వరాష్ట్రప్రదేశ్ పురోగతి, స్వావలంబన ప్రయాణంలో ఈ ప్రాజెక్టును ఒక నిర్వచించే మైలురాయిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి, ఐదు సంవత్సరాలలో (2026-2030) రాష్ట్రంలో 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలను , 20,000–30,000 మొత్తం ఉద్యోగాలను సృష్టిస్తుందని, విశాఖపట్నంకు అవసరమైన మానవశక్తి, మౌలిక సదుపాయాలు, విద్యుత్ మరియు శీతలీకరణ సౌకర్యాలను తీసుకువస్తుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన గుణకార ప్రభావాన్ని సృష్టిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు
Google AI Hub Launch in Visakhapatnam
భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూ ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి… pic.twitter.com/dU5WYGL07s
— Telugu Desam Party (@JaiTDP) October 14, 2025
రాబోయే ఐదేళ్లలో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,33,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా థామస్ కురియన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ను ప్రారంభిస్తున్నాం. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుతామని తెలిపారు. ఈ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్లు వివరించారు.
ఈ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను (టీపీయూ) వాడతామని, ఇవి ఏఐ ప్రాసెసింగ్‌కు రెట్టింపు వేగాన్ని అందిస్తాయని కురియన్ పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ వంటి ఎన్నో సేవలను ఇకపై భారత్ నుంచే ప్రపంచానికి అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ హబ్ ద్వారా కేవలం టెక్నాలజీని అందించడమే కాకుండా, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో ఇది మా భాగస్వామ్యం" అని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్)లో పోస్టు చేసిన విషయానికి బదులిచ్చారు.చైతన్యవంతమైన నగరం విశాఖపట్నంలో గూగుల్ AI హబ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గూగుల్ AI హబ్ గిగావాట్-స్థాయి డేటా సెంటర్,కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే,భారీ ఇంధన మౌలిక సదుపాయాలు వంటి అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడనుంది. దీని ద్వారా గూగుల్ భారతీయ సంస్థలు, వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీ సేవలను అందించి, AI ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ AI కేంద్రం భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, భారత్‌ను ప్రపంచ టెక్నాలజీ లీడర్‌గా స్థిరపడేలా చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో మాట్లాడటం గొప్ప అనుభవంగా ఉందన్నారు. విశాఖపట్నంలో గూగుల్ మొట్టమొదటి AI హబ్ ఏర్పాటు ప్రణాళికలను ఆయనతో పంచుకున్నాం. ఇది చరిత్రాత్మక అభివృద్ధి అని అన్నారు. గూగుల్ ఈ హబ్‌లో గిగావాట్-స్థాయి కంప్యూట్ సామర్థ్యంని ఏర్పాటు చేయనుంది. తద్వారా దేశవ్యాప్తంగా AI పరిశోధన, వినియోగం వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ 2026–2030 మధ్య ఐదు సంవత్సరాల్లో అమలు కానుంది. గూగుల్, అదానీకానెక్స్, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ భాగస్వాములతో కలిసి, డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించనుంది.