
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు అన్ని కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది. విలీనానికి సంబంధించిన సాంకేతిక అనుసంధాన (technical integration) పనుల కారణంగా ఈ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఈ నాలుగు బ్యాంకుల డేటాను ఒకే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం, సిస్టమ్స్ సమన్వయం చేయడం వంటి పనులు జరుగనున్నాయి.
ఏ బ్యాంకులు విలీనమవుతున్నాయి?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న నాలుగు గ్రామీణ బ్యాంకులు
1. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు
2. సప్తగిరి గ్రామీణ బ్యాంకు
3. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు
4. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
ఈ నాలుగు సంస్థలను కలిపి కొత్తగాఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (Andhra Pradesh Grameena Bank) పేరుతో ఒకే సంస్థగా ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం సేవలను ఏకరీకరించడం, డిజిటల్ బ్యాంకింగ్ సామర్థ్యాలను పెంపొందించడం, గ్రామీణ వినియోగదారులకు సమర్థవంతమైన బ్యాంకింగ్ అనుభవం అందించడం.
బ్యాంకు ప్రకటన ప్రకారం, అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అక్టోబర్ 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఈ కాలంలో బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS) వంటి అన్ని డిజిటల్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఈ కాలంలో అక్టోబర్ 11 (రెండో శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సాధారణంగా ఆన్‌లైన్ సేవలు ఆ రోజుల్లో పనిచేసినా, ఈ విలీన ప్రక్రియ కారణంగా అవి కూడా నిలిచిపోతాయని బ్యాంకు స్పష్టం చేసింది.
ఈ సేవల అంతరాయం వల్ల ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ముందుగానే ఆర్థిక లావాదేవీలను పూర్తిచేసుకోవాలని బ్యాంకు విజ్ఞప్తి చేసింది. నగదు విత్‌డ్రాలు, బిల్లుల చెల్లింపులు, ట్రాన్స్ఫర్‌లు వంటి ముఖ్యమైన లావాదేవీలు అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు పూర్తి చేసుకోవాలని సూచించింది.