
Visakhapatnam, Nov 3: విశాఖలోని నలుగురు విద్యార్ధినిలు అదృశ్యం ( Four Girl Students Are Missing) అయ్యారు. వన్‌టౌన్ సమీపంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ స్కూల్లో వీరంతా చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ పూర్తయిన తర్వాత ట్యూషన్‌కి వెళ్తాం అని చెప్పి.. తిరిగి (Missing In Visakhapatnam) కనిపించలేదు. కుటుంబ సభ్యులు రాత్రి అంతా గాలించారు. చివరికి గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అదృశ్యమైన నలుగురు విద్యార్థులు తమ గురించి వెతకవద్దని లేఖను కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి రాశారు. అయితే వారు సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఉంటారనే వాదన వినిపిస్తుంది. విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ, రేణుక, హన్సిక, యమున అనే ఈ నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లేఖలోని రాసిన సారాంశం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
కనిపించకుండాపోయిన విద్యార్థినిలు రాసి లేఖగా భావిస్తున్న సారాంశం ఇలా ఉంది: మాకోసం వెతక్కండీ..మేము మా కాళ్లమీద బతకాలి అనే దూరంగా వెళ్లిపోతున్నాం..అంతేతప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనికాదు..మా బతుకు కోసం వెళ్తున్నాం..అలా అని మేము అబ్బాయిలతో వెళ్తున్నాము అని మీరు అనేసుకోవద్దు. మేము పైకి ఎదగటానికి మాత్రమే వెళ్తున్నాం..మాకోసం వెతకొద్దు. మేము ఎక్కడున్నా మీకోసమే ఆలోచిస్తాం. మేము మంచి ‘పొజిషన్’ కు వచ్చాక మేమే మీ దగ్గరకొస్తాం..అంటూ రాసినట్లుగా ఉంది.వారి ఇష్టంతోనే వెళ్లారా? లేదా వారితో ఎవరైనా బలవంతంగా లేఖ రాసి కిడ్నాప్ చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు పోలీసులు. పోలీస్, వాలంటీర్ గ్రూపుల్లో విద్యార్థినిల ఫోటోలు షేర్ చేసి వారి ఆచూకీల లభిస్తే వెంటనే చెప్పాలని కోరుతున్నారు.