Andhra Pradesh: వ్యాపారంలో కోటికి పైగా నష్టాలు, కుటుంబం మొత్తం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
Representational Picture. Credits: PTI

Vijayawada, April 26: వ్యాపారంలో నష్టాలు రావడంతో..తెచ్చిన అప్పులు తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు ( Four of family attempts suicide) పాల్పడింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కొజ్జిలి పేటకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు(55) పప్పుధాన్యాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రాధారాణి (48), కుమార్తెలు భవాని (28), శ్రావణి (27) ఉన్నారు. భవాని మానసిక దివ్యాంగురాలు. శ్రావణి బీటెక్‌ పూర్తి చేసింది.

కొన్ని సంవత్సరాలుగా పప్పుధాన్యాల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వరరావుకు సుమారు కోటి రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో వెంకటేశ్వరరావు అప్పులపాలయ్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడం, అప్పులు తీర్చే దారి కనిపించక కుటుంబంతో కలిసి నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఈ నెల ఎనిమిదో తేదీన విజయవాడ వచ్చి బస్‌స్టేషన్‌ సమీపంలోని బాలాజీ డార్మెటరీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మనస్తాపం చెంది నలుగురూ చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుమందు (consuming pesticide in Vijayawada) తాగారు.

తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం, బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్‌, కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లిన తండ్రి

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తాము చనిపోతున్నామని, తమ గురించి ఎవరూ వెతకవద్దని, తమను ఎవరూ కాపాడొద్దని మచిలీపట్నంలో ఉంటున్న మామయ్య దేవత శ్రీనివాస్‌ ఫోన్‌కు శ్రావణి మెసేజ్‌ చేసింది. ఆ మెసేజ్‌ చూసిన వెంటనే శ్రీనివాస్‌ స్పందించి డార్మెటరీ యజమానికి ఫోన్‌ ద్వారా విషయం చెప్పాడు. డార్మెటరీ సిబ్బంది వెంటనే వ్యాపారి ఉంటున్న గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా శ్రావణి తలుపు తీసి కింద పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వ్యాపారి కుటుంబ సభ్యులు నలుగురూ పురుగు మందు తాగినట్లు గుర్తించారు.

ఆ గదిలో పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాల గురించి పోలీసులు శ్రావణిని అడిగి వివరాలు సేకరించారు. నలుగురినీ అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు ఆరోగ్యం విషమంగా, మిగిలిన ముగ్గురు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.