Amaravati, Oct 13: అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం (Government announces ₹2,000) అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం నగరంలో రెండో రోజు వరద ఉధృతి (flood-hit families in Anantapur) కొనసాగుతోంది. ఏకధాటిగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగర శివారులోని కాలనీలు జలమయం అయ్యాయి. నగరంలోని ఐదు కాలనీల్లో వరద నీరు నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగడంతో బాధితులు సర్వం కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి అనంత నగర పరిధిలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని 5 కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నడిమి వంకకు పెద్దఎత్తున వరద పోటెత్తింది. దీనికితోడు ఎగువ ప్రాంతంలో ఉన్న యాలేరు, ఆలమూరు, కాటిగాని కాలవ గ్రామాల చెరువుల నుంచి వర్షపు నీరు నగరానికి ఆనుకుని ఉన్న నడిమివంకలో ప్రవహిస్తోంది. కాలనీల్లో 5 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఇళ్లలోని వస్తువులు నీట మునగడంతో సర్వం కోల్పోయామని.. కనీసం తలదాచుకోవడానికి అవకాశం లేకుండా వరదలు ముంచెత్తాయని బాధితులు వాపోయారు.
అగ్నిమాపకశాఖ, పోలీసు సిబ్బంది బుధవారం తెల్లవారుజాము నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. వరదలో చిక్కుకున్న చిన్నారులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగర పరిధిలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇంతకు మూడు రెట్లు వర్షం కురిసినా అనంతపురం నగరంలో ఈ స్థాయిలో వరదలు రాలేదు. నడిమి వంక ఆక్రమణకు గురికావడంతోనే ఇరువైపులా కాలనీలు మునిగినట్లు ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రక్షణ గోడ లేని ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.