Amaravati, August 30: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పాదనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు (Andhra Pradesh government complains to KRMB against Telangana ) చేసింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ (KRMB) సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) నారాయణరెడ్డి లేఖ రాశారు.
అవసరం లేకున్నా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పాదన చేయడంతో (power generation at Srisailam project) నీటిమట్టం తగ్గుతోందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేని పరిస్థితి తలెత్తుతుందని.. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికీ నీరు ఇవ్వలేమని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు. విద్యుదుత్పాదన ద్వారా వస్తున్న నీరు సాగర్‌లో నిలిపే అవకాశం లేదని.. సాగర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉందని ఈఎన్‌సీ వివరించారు. మరోవైపు దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోనూ నీటి నిల్వకు అవకాశం లేదన్నారు.
శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదనకు వాడుతున్న నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోతోందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ విద్యుదుత్పాదన వల్ల వృథా అవుతున్న నీటిని వారికి కేటాయించిన కోటా నుంచి మినహాయించాలని కోరారు. తెలంగాణ విద్యుదుత్పాదన తక్షణమే నిలుపుదల చేయాలంటూ కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేశారు.