Vizag, Oct 13: కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు.
కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటుచేసిన సంగతి విదితమే. కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోను, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలోను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి ఆదేశించారు.
కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ భవనం, వసతులు కల్పిస్తే హైదరాబాద్ నుంచి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది. విశాఖపట్నంలో నార్త్‌కోస్ట్ సీఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్మించిన భవనంలో ఒక అంతస్తును కృష్ణాబోర్డు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించి, బోర్డుకు తెలిపింది.