Nellore, May 31: కరోనావైరస్ మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులను (Krishnapatnam Anandaiah Medicine) రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు (Anandaiah Medicine) ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు. కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ANI Update
Andhra Pradesh government gives green signal for distribution of Ayurvedic concoctions except for eye drops, made by Bonigi Anandaiah, Ayurvedic practitioner from Krishnagiri village in Nellore district: Andhra Pradesh Chief Minister's Office (AP CMO)
— ANI (@ANI) May 31, 2021
ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది. ఆనందయ్య మందును తీసుకునేందుకు కొవిడ్ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. ఆనందయ్య మందు పంపిణీలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలంటూ ఆదేశించింది.
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. ప్రస్తుతం ఆనందయ్య కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడమీలోనే ఉన్నారు. ఇప్పటికైనా ఆనందయ్యకు పోలీసులు విముక్తి కలిగిస్తారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఆనందయ్య ఇంటికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.