
Vijayawada, Feb 28: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను (AP Full Budget Today) ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను మరోసారి ప్రవేశపెడతారు.
ప్రాధాన్యం వీటికే..
2025-26కు సంబంధించి సుమారు రూ. 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ ఉండనుందని సమాచారం. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, మే నుంచి తల్లికి వందనం పథకాల అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ అమలు చెయ్యాలంటే వెంటనే రూ.20వేల కోట్లు అవసరం అని అంచనా. వీటిని ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఇవాళ్టి బడ్జెట్ లో ఈ సూపర్ 6 పథకాలకు కేటాయింపులు కీలకం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలను వ్యవసాయానికి కేటాయిస్తారని సమాచారం.