Andhra Pradesh govt allotted 2 acres of land and make offer Lecturer Post to dr sake bharati who did her phd while working as a labourer

Vjy. August 1: అనంతపురం జిల్లా నుంచి కూలీ పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి (Dr Saake Bharti)కి వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఆమెకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీ పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో సాకే భారతి పీహెచ్‌డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు.

సంకల్పం ఉంటే మన విజయాన్ని ఏది ఆపలేదనడానికి సాకే భారతి నిదర్శనమన్నారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆమె యువతకు రోల్ మోడల్‌గా మారిందన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి సాకే భారతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

సాకే భారతి, కూలి పనుల నుంచి పీహెచ్‌డీ పట్టా దాకా, చదువుల తల్లి పట్టుదలకు సలాం కొట్టిన సోషల్ మీడియా, పూర్తి వివరాలు ఇవిగో..

మరోవైపు, ఆమెకు ఉద్యోగ అవకాశం కింద జూనియర్ లెక్చరర్ పోస్ట్‌ని గుర్తించామని తెలిపారు. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు.