స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా... అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు.
ఏఏజీ నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఉండవల్లి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు..తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. అలాగే అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో బాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది.