High Court of Andhra Pradesh | File Photo

Amaravathi, June 25:  ఆంధ్రప్రదేశ్ జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఈ ఎన్నికలను రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్ట్ డివిజన్ బెంచ్ నిలిపివేసింది. అయితే ఈ అంశంపై జూలై 27న సమగ్ర విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది మరియు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఓట్ల లెక్కింపు నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.

పోలింగ్ తేదీకి కనీసం 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ మే 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డిచిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

గత నెల ఏప్రిల్ 8న ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 7,220 ఎంపిటిసిలు, 515 జెడ్‌పిటిసి స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో సుమారు 61 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది.