VJY, May 5: రాజధాని అమరావతి ప్రాంతంలోపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల, ఫలితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీని నిలువరించాలని కోరుతూ అమరావతి రైతులు ఉన్నత న్యాయస్థానంలో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విచారణ పూర్తిచేసిన హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా పట్టాలు ఇవ్వడం సరికాదని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత అక్కడే నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలువరించాలని అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒప్పందం ప్రకారం రైతులకు రావాల్సిన భూమినే కోరాలి తప్ప.. సీఆర్‌డీఏ, ప్రభుత్వం పరిధిలో ఉన్న భూమిని ఎవరికైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే రైతుల పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేపు (శనివారం) సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రైతులు వెళ్లనున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు.