Andhra Pradesh PRC Row: కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా?, పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించిన హైకోర్టు, పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం
High Court of Andhra Pradesh | File Photo

Amaravati, Jan 24:  ఏపీలో పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (Andhra Pradesh High Court) సోమవారం విచారించింది. ఈసందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్‌ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని (Andhra Pradesh PRC Row) సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక (11th PRC) బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీ గెజెటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు పీఆర్సీని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు.

నేడే సమ్మె నోటీసు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మెలోకి ఆర్టీసీ, వైద్య సిబ్బంది, PRC సాధన సమితి ప్రకటన..

సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్‌ పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఏజీ కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, అయితే, చర్చలను రాబోమని చెప్తున్నారని కోర్టుకు తెలిపారు.