Amaravati, Sep 4: జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తల్లులు ఫీజు చెల్లించకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరఫున హైకోర్టు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఫీజులను కళాశాలల ఖాతాల్లో జమ చేయాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం (Andhra Pradesh high court ) విద్యా దీవెన కింద ఇచ్చే డబ్బును విద్యా సంస్థల ప్రిన్సిపల్ అకౌంట్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (AP Govt) ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం (Jagananna Vidya Deevena) కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
త్రైమాసికానికి ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును 40% మంది కళాశాలలకు చెల్లించలేదని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. లేదా? మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా? అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని గుర్తు చేసింది. లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని వెల్లడించింది. తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించింది. కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తే విద్యార్థులు మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. తద్వారా పథకం ఉద్దేశం నెరవేరదని తెలిపింది. అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ‘ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం’ అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్ ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. 2019 నవంబరు 30న తీసుకొచ్చిన జీవో 115 ప్రకారం.. రీయింబర్స్‌మెంట్ ఫీజును కళాశాలల ఖాతాల్లో వేసేవారన్నారు. జీవో 115కి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు 28, 64 తీసుకొచ్చిందన్నారు. తద్వారా సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో వేసేందుకు వీలు కల్పించారన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు, ఆర్థికంగా బలహీనులన్నారు. వారు ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఎంతమంది తల్లులు కళాశాలలకు ఫీజులు చెల్లించలేదో వివరాల్ని కోర్టుకు సమర్పించారు. సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ వ్యాజ్యంలో కౌంటరు దాఖలు చేస్తూ.. విద్యార్థుల తల్లుల చేతికి అధికారం ఇవ్వాలని జీవోలు ఇచ్చామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న నాయమూర్తి.. సొమ్మును తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలుకల్పించే జీవోలను రద్దు చేశారు. జగనన్న విద్యా దీవెన సొమ్మును కళాశాలల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద చెల్లింపుల అంశాన్ని ఈ వ్యాజ్యంలో నిర్ణయించలేదని స్పష్టం చేశారు.