Amaravati, Dec 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections in AP) ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) గత నెల 17న ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి విదితమే. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును (Andhra Pradesh High Court ) ఆశ్రయించింది.
దీనిపై హైకోర్టు ప్రభుత్వం కోరినట్లు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో చాలా లోతుగా విచారణ జరపాల్సిన అంశాలు చాలా ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఎన్నికలను పూర్తి చేయలేదు. తర్వాత 2019లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలవగా.. అందులో ధర్మాసనం పలు ఆదేశాలిచ్చింది. పర్యవసానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ కోవిడ్‌వల్ల వాయిదా పడింది.
ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్‌ఈసీ (Andhra Pradesh state election commission) ఇచ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు అడ్డుకోగలదా? అలా అడ్డుకోవడం ధర్మాసనమిచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అన్నది పరిశీలించాలి. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందా? లేక కేవలం వాయిదా పడిందా? అన్నదీ పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైవుంటే.. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వవచ్చా? అన్నదీ పరిశీలించాలి.
ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్‌ఈసీ ఇటీవల జారీచేసిన ప్రొసీడింగ్స్ హేతుబద్ధమైన అంశాల ఆధారంగా జారీచేసింది కాదని ఏజీ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని సంప్రదించాకనే నిర్ణయించామని ఎస్‌ఈసీ న్యాయవాది అంటున్నారు. కాబట్టి ఈ దశలో ఎస్‌ఈసీ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనా? కావా? అన్నదానిని ఈ కోర్టు తేల్చజాలదు.
ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని నిర్ణయిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను ఎన్నికల కమిషనర్ ఈ కోర్టుకు తప్పక వివరించాలి. పైన చెప్పిన అంశాలన్నింటినీ తేల్చేందుకు ఎస్‌ఈసీ నుంచి పూర్తిస్థాయి కౌంటర్ అవసరం. తుది ఉత్తర్వులిచ్చేముందు ఈ మొత్తం వ్యవహారంలో లేవనెత్తిన పలు అంశాల వాస్తవికతపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కారణాలరీత్యా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోరినట్టుగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్నారు.