Amaravati, Jan 11: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) విడుదల చేసిన పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ రద్దు చేసింది. కాగా పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు (AP High Court) ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను (AP Local Body Elections Row) ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఈ షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయన నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.