Kuppam, Jan 16: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan) ఆదేశిస్తే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu)పై పోటీ చేయడానికి తాను సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. పుంగనూరులో తనపై పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కుప్పం, పుంగనూరు.. రెండుచోట్లా పోటీకి తాను సిద్ధమని తెలిపారు.
చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయిందని, చిత్తూరు జిల్లాను వదిలేసి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడు విశ్వసించలేదు. చంద్రబాబు ప్రజాకంఠక పరిపాలన చేశారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలు విశ్వసించరు. చంద్రబాబుకు మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పనేమీ లేదు.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. చంద్రబాబు తన కోసం, తన ఎల్లో మీడియా కోసమే పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు. కుప్పంలో వైఎస్సర్‌సీపీనే గెలుస్తుంది. కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయం. ప్రజాస్వామ్మం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు ప్రజాకంఠక పాలనపై రాష్ట్రంలో అందరికీ తెలుసు. చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా. ప్రజా సంక్షేమ కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా పక్షానే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
టీడీపీ (TDP) ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా (Annamayya District) పీలేరు సబ్ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలను ఆయన సోమవారం పరామర్శించారు. వారిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఏం తప్పు చేశారని టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారు. భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా? నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. పోలీసులూ.. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. పెద్దిరెడ్డి పనైపోయింది.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.