Amaravati, Sep 22: ఏపీ సర్కారు గురువారం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ (Jagan Govt,Jagan Govt bans plastic flex banners) ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది.
రాష్ట్ర అటవీ పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతో పాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలపైనా నిషేధం అమలు కానుంది.
ఇక ఈ నిషేధం (bans plastic flex banners) అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షస్తారని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీకి రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉల్లంఘనులను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వస్త్రాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.