Vjy, Nov 8: రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగేసింది. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్- 2023 ( Global Investors Summit 2023) లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్ ఎస్ నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ను విశాఖపట్నంలో (Vizag) నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఈ సమ్మిట్ నిర్వహిస్తాం. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. గత మూడేళ్లలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయారు.
ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు నిర్వహించడం ప్రారంభించాయి. ఎంఎస్‌ఎంఈలపై కూడా ఫోకస్ పెట్టాం. రాష్ట్రంలో పరిశ్రల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నాం. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. 5 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టుకి 2024 జనవరి నాటికి మొదటి షిప్ తెస్తాం. దేశానికి ఏపీనే గేట్‌వేగా మారబోతోంది. ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం’ అని తెలిపారు.