Vjy, Mar 12: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) కౌన్సిల్ చైర్మెన్ వేటు వేశారు.వైసీపీ నుండి ఎన్నికై వేరే పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు ఇటీవల పార్టీమారిన విషయం తెలిసిందే.
వంశీ కృష్ణ జనసేనలోకి వెళ్లగా, రామచంద్రయ్య సైకిలెక్కారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన మండలి చైర్మన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. వారికి నోటీసులు జారీచేశారు. వారినుంచి వివరణ కూడా తీసుకున్నారు. సమగ్ర విచారణ తర్వాతే ఇద్దరిపై వేటు వేసినట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీలు ఇద్దరు తమ పదవులను కోల్పోయారు.
ఇటీవల ఎనిమిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. వారిలో వైసీపీ నుంచి టీడీపీకి, తెలుగుదేశం నుంచి అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి (వైసీపీ), కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాళి గిరి (టీడీపీ)పై వేటు పడిన విషయం తెలిసిందే.