
Amaravati, August 10: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,849 పరీక్షలు నిర్వహించగా.. 1,461 కేసులు (Corona in AP) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,85,182 మంది వైరస్ (Coronavirus in AP) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,564కి చేరింది.
24 గంటల వ్యవధిలో 2,113 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,52,736కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,53,11,733 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ప్రభుత్వం పేర్కొంది. వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య ఐదడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. గన్నవరం నుంచి ఏపీలోని 13 జిల్లాలకు టీకాలను వైద్యాధికారులు సరఫరా చేయనున్నారు.