ఏపీలో గడచిన 24 గంటల్లో 31,473 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 222 మందికి పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లాలో 38, విశాఖ జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 28, నెల్లూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 275 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,738 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,53,755 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,560 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 14,423కి పెరిగింది.
కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన గురువారం సచివాలయంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రగతిని వివరించారు.
సీఎస్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ కోవిడ్‌ను గుర్తించి, అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్సు ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సమాచార ప్లాట్‌ఫామ్, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు గురించి ఆరా తీశారు. సకాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.