Amaravati, June 8: తెలుగుదేశం (Telugu desam) పార్టీ నేతలకు పనేమీ లేదని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల రోజుల్లో ప్రతీ గడప గడపకూ వెళ్తున్నాము. ప్రజలకి మేము చేసింది చెప్తున్నాం. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఏమైనా ఫిర్యాదులు చేస్తే.. వాటిని వెంటనే పరిష్కారించే దిశగా ప్రయత్నం చేయాలని సీఎం జగన్ చెప్పారు.
ఎవరైనా పథకాలు అందడం లేదంటే.. అందుకు గల కారణం కనుక్కోవాలని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ వారికి పనేమీ లేదు.. గడప గడప కార్యక్రమంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తుంది. సీఎం జగన్ ఇస్తున్న పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. టీడీపీ వాళ్లతో పాటు అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయి. లక్ష 50వేల కోట్ల నిధులు నేరుగా ప్రజలకి అందాయి. కాబట్టి 151 స్థానాలు కాదు. ఈ సారి కుప్పంతో కలిపి 175 గెలుస్తాం అని అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తెలిపారు.
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్ల లేని వ్యతిరేకతను వండి వార్చి ఇవ్వడం సరికాదని మీడియాకు హితవు పలికారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ పథకాలు అందకున్నా, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. విమర్శలను స్వీకరించి పొరపాట్లను సరిదిద్దాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని పేర్ని నాని వెల్లడించారు.
టీడీపీ నేతల విమర్శలు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారంపై పేర్ని నాని స్పందిస్తూ.. అలా అనుకుంటే వాళ్ల మనుగడ కొనసాగేది!. 2019లో నేనే సీఎంగా ప్రమాణం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు కొత్త బట్టలు కుట్టించుకున్నారు. పదవి ఊడేదాకా చంద్రబాబుకు విషయమే తెలియలేదు. ప్రజలతో మమేకమై ఉంటేనే కదా ఆయనకు ప్రజాస్పందన తెలిసేది. ఇప్పుడు కూడా ఊహల్లోనే బతుకుతున్నాడు.. పార్టీని బతికించాలి.. కొడుకు నాయకత్వాన్ని బతికించే తాపత్రయం తప్పా ఇంకేం కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసొస్తుందని పేర్ని నాని చెప్పారు.