Amaravati, May 24: గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన పార్టీని ప్రజలు బాదుడే బాదుడని అనేశారని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు, ఆయన కొడుకుని ప్రజలు తరిమేశారన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu Slams To Chandrababu) మీడియాతో మాట్లాడుతూ.. 'నర్సారావుపేటలో మే 28న సామాజిక న్యాయభేరి బహిరంగ సభ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు జరుగుతాయి. ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ తప్ప మరొకటి లేదు. ఇది పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవచ్చు. సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
గతంలో ఓట్లు మావి పదవులు మీవి అని బీసీ కులాలు వారు అనేవాళ్లు. ఇప్పుడు ఓట్లు మీవే.. సీట్లు మీవే.. మంత్రి పదవులు మీవే అని సీఎం జగన్ చెప్పారు. శ్రీ కృష్ణుడు వేషం వేశాడని ఎన్టీఆర్‌కు బీసీలు అండగా ఉన్నారు. చంద్రబాబు ముందే ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. రెండేళ్ల తర్వాతే ఎన్నికలు వస్తాయి. మహానాడును చిన్నప్పటి నుండి చూస్తున్నాం. అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అసహనంలో చంద్రబాబు భాష కూడా మారిపోయిందని' మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మే 28న పల్నాడు జిల్లా చేరుకోనున్నట్లు మంత్రి విడుదల రజినీ తెలిపారు. ఈ మేరకు చిలకలూరిపేటలో మంత్రి రజినీ మీడియాతో మాట్లాడుతూ.. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అని గురజాడ అన్నారు. చంద్రబాబులా జగన్ వట్టి మాటలు చెప్పలేదు. ఎన్నికలు ముందు ఏం చెప్పామో అది చేశాం. వట్టి మాటలు కాకుండా బీసీలకు గట్టి మేలు తలపెట్టారు. కేబినెట్‌లో 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల్లో పది మంది బీసీలే ఉన్నారు. బీసీగా నాకు టికెట్ ఇవ్వడమే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారని మంత్రి విడదల రజినీ అన్నారు.