VJy, Mar 28: గత కొంత కాలం నుంచి ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. పలువురు పార్టీ మారుతున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి పార్టీ మారుతున్నారన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్‌తోనే ఉంటానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని ధ్వజమెత్తారు. అందులో భాగమే ఈ దుష్ప్రచారమని.. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కోవూరులో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదేమైనా జగన్‌తోనే తన పయనమని స్పష్టం చేశారు.